A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 6:59 am Posted by : A2TV NEWS

ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 20:

మెదక్‌ జిల్లా (19) ట్రిపుల్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్‌) భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణపై నేషనల్‌ హైవేస్‌, రైల్వే, రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అవార్డు పాస్‌ అయిన భూముల వివరాలను ‘భూమి రాశి’ పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు పరిహారం చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. భూసేకరణ వేగంగా పూర్తయితే ట్రిపుల్‌ఆర్‌ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.అదేవిధంగా మేడ్చల్‌ నుంచి ముద్గేడ్‌ వరకు రైల్వే డబ్లింగ్‌ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అంబదాస్‌ రాజేశ్వర్‌, ఆర్డీవోలు మెదక్‌ రమాదేవి, నర్సాపూర్‌ రామకృష్ణ, తూప్రాన్‌ బావయ్య, నేషనల్‌ హైవేస్‌ మేనేజర్‌ రాహుల్‌, రైల్వే ఎస్సీడీ ధర్మారావు, రాకేష్‌, సంబంధిత తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.