అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 27:
మెదక్ జిల్లా (26) తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టోస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి రాజు, అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీమోహన్, విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజు, మెదక్ జిల్లా TOSS కోఆర్డినేటర్ ఎ. వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ చదువును మధ్యలోనే మానేసిన 14 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు, యువతీ యువకులకు ఓపెన్ స్కూల్ విద్య చక్కటి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే ఆసక్తి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుకు దూరమైన వారు తమ విద్యను కొనసాగించి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.