A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 6:13 am Posted by : A2TV NEWS

ఓటర్ల సవరణకు వేగం పెంచాలి

పెండింగ్‌ నోటీసులు వెంటనే జారీ చేయాలి

ఏడు రోజుల తర్వాతే విచారణ.. సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 :

మెదక్ జిల్లా (29) ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేసి, నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల గడువు పూర్తయిన తర్వాత విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, రికార్డుల పరిశీలనపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ ప్రక్రియలో నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులో విచారణ పూర్తి చేయాలని, సంబంధిత రికార్డులను పరిశీలించి పెండింగ్‌ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం ఏడు రోజుల గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండి అనంతరం విచారణ నిర్వహించాలని తెలిపారు.

జాబితాలను అందుబాటులో ఉంచాలి

అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని సీఈఓ సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమయంలో సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై ఓటర్లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.

నిబంధనల మేరకు పూర్తి చేస్తాం

జిల్లాలో అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు సంబంధించి నోటీసులు జారీ చేసి, వివరాలను యాప్‌లో నవీకరించినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రక్రియ కొనసాగిస్తున్నామని, నిర్ణీత గడువులోగా సవరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఈఓకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ గఫార్‌, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.