సామాజిక వివక్షకు తావులేకుండా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి: బీసీ కమిషన్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 17:
మెదక్ జిల్లా(16) లోది సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాల లక్ష్మీరంగు గురువారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని లోది సామాజిక వర్గం నివాస ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా లోది సామాజిక వర్గ సంఘాల ప్రతినిధులు, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రిజర్వేషన్లు, వృత్తిపరమైన అవకాశాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలను స్వీకరించారు. తమకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని లోది సామాజిక వర్గ ప్రజలు కమిషన్‌ను కోరారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ, లోది సామాజిక వర్గ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి సామాజిక వివక్షకు లోది సామాజిక వర్గం గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు అందించిన వినతులు, సూచనలు, అభిప్రాయాలను పరిశీలించి, కమిషన్ పరిధిలో సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన నివేదికలు, సిఫార్సులు అందజేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, పెద్ద శంకరంపేట మండలంలోని ఆరేపల్లి, పెద్ద శంకరంపేట, కమలాపూర్ గ్రామాల్లో మొత్తం 43 కుటుంబాలకు చెందిన 179 మంది లోది సామాజిక వర్గ ప్రజలు ఉన్నారని తెలిపారు. రేగోడు మండలంలోని కొత్వాన్‌పల్లి గ్రామంలో 19 కుటుంబాలకు చెందిన 77 మంది ఉన్నట్లు వివరించారు.
లోది సామాజిక వర్గ ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రం పొందడంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రస్తుతం కొందరు ముదిరాజ్ కులం పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారని తెలిపారు. లోది సామాజిక వర్గానికి మరిన్ని విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారిని సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి సామాజిక వివక్షకు తావులేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతికుమార్, సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, లోది కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.