A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 7:20 am Posted by : A2TV NEWS

పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

A2న్యూస్, జులై 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (2) ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ, స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, వాటి దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ సృజనకు సూచించారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమయపాలనతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత సమర్థంగా అమలు చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ, ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, కీలక ప్రాంతాల్లో కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శక పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ తనిఖీలో రామాయంపేట్ సీఐ సైదా, ఎస్‌ఐ సృజనతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.