A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:48 am Posted by : A2TV NEWS

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెడతాం

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 16:

మెదక్ జిల్లా (15) అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా వేడుకల ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యేక శాలువాతో మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ తదితరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో రూపొందిన రాజ్యాంగం భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు, అమరులకు ఘన నివాళులు అర్పించారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. భూముల రీ-సర్వే, డిజిటల్ సర్వే ప్రక్రియలో మెదక్ జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో చేపట్టిన రీ-సర్వేలో 10 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం కొత్త పాస్ పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా భారీ ప్రయోజనం

ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మహిళలు 4 కోట్ల 49 లక్షల సార్లు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీని ద్వారా మహిళలకు రూ.161 కోట్ల 49 లక్షల మేర ప్రయోజనం చేకూరిందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో 1,29,756 మంది విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లలోపు జీరో బిల్లులు జారీ చేశామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.108 కోట్ల 80 లక్షల సబ్సిడీ అందించిందన్నారు. 2024 జనవరి నుంచి 2026 జూలై వరకు 6,663 వ్యవసాయ బావులకు రూ.49 కోట్ల 97 లక్షలతో విద్యుత్ కనెక్షన్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

రైతు భరోసాతో రైతులకు పెట్టుబడి మద్దతు

పట్టాదారు పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో వానాకాలం 2026 సీజన్‌కు 2,66,674 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.222 కోట్ల 69 లక్షలు జమ చేసినట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 28,933 ఎకరాల్లో కంది, మినుము, పెసర, సోయాబీన్, మక్కజొన్న, ఆముదం, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటలను సాగు చేసినట్లు తెలిపారు.

ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్య భరోసా

రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 39,339 మంది పేదలు చికిత్స పొందగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.110 కోట్ల 84 లక్షలు ఖర్చు చేసిందన్నారు.

అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం

జిల్లాలోని 1,076 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 5,633 మంది గర్భిణీలు, 3,771 మంది బాలింతలకు, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల 24,954 మంది పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల 22,979 మంది పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు, సంపూర్ణ భోజనం, స్నాక్స్ అందిస్తున్నామన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు 100 శాతం విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు టేబుల్స్, బుక్ ర్యాక్స్, ప్రీ-స్కూల్ పుస్తకాలు, యూనిఫారాలు అందించామని తెలిపారు.

500కే వంటగ్యాస్

పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.500కే వంటగ్యాస్ పథకంలో భాగంగా జిల్లాలో 1,27,000 మంది లబ్ధిదారులకు 8,64,388 గ్యాస్ సిలిండర్లు అందించామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.26 కోట్ల 14 లక్షల సబ్సిడీని ఖర్చు చేసిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2,42,353 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడే 15,033 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 28,582 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు 1,06,448 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డుల్లో చేర్చినట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో 2,41,393 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు.

రైతులకు మద్దతు ధర

యాసంగి 2025–26 సీజన్‌లో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,00,344 మంది రైతుల నుంచి 4,25,305 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,116 కోట్ల 6 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.

విద్యారంగానికి ప్రాధాన్యత

2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 905 ప్రభుత్వ పాఠశాలల్లో 72,896 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా మెదక్ జిల్లాకు రెండు పాఠశాలలు మంజూరయ్యాయని చెప్పారు. రామాయంపేటలో 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో 120 ప్రాథమిక పాఠశాలల్లో 1,417 మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నామని, 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చిన్న మరమ్మతుల కోసం రూ.326 లక్షలు మంజూరు చేశామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి కల

సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల సబ్సిడీతో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో రూ.447.75 కోట్ల బడ్జెట్‌తో 8,955 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మంజూరైన ఇళ్లలో 7,382 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 4,353 ఇళ్లు నిర్మాణంలో కీలక దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 6,309 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.169 కోట్ల 18 లక్షలు నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

పచ్చదనానికి పెద్దపీట

వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 31 లక్షల 95 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 14 లక్షల 30 వేల మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు.

మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరంలో 12 వేల సంఘాలకు రూ.610.72 కోట్ల బ్యాంక్ లింకేజీ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1,819 సంఘాలకు రూ.145.62 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. జిల్లాలో 391 ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.39.10 కోట్లు కేటాయించామని చెప్పారు. 20 మండల సమాఖ్యలకు రూ.7.20 కోట్లతో 20 బస్సులు కొనుగోలు చేసి టీజీఆర్‌టీసీకి అందించామని, వీటి ద్వారా ప్రతి మండల సమాఖ్యకు నెలకు రూ.69,468 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో 134 సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.18.27 కోట్ల రుణాలు, 854 మహిళా సంఘాలకు రూ.3.09 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 50 వ్యక్తిగత యూనిట్లకు రూ.98 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.

గ్రామీణాభివృద్ధికి ఊతం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 1,086 పనులకు రూ.98.51 కోట్లు మంజూరయ్యాయని, అందులో 271 పనులు పూర్తికాగా మరో 438 పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎస్‌డీఎఫ్ కింద 219 అభివృద్ధి పనులు మంజూరు కాగా 42 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక

ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం, ఫైళ్ల వేగవంతమైన క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

పర్యాటక అభివృద్ధికి చర్యలు

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా అమ్మవారి ఆలయంలో వసతి గృహాల ఏర్పాటుకు టూరిజం శాఖ ద్వారా రూ.7 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. మెదక్ పోర్ట్ పునరుద్ధరణకు రూ.57 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పోలీసులకు అభినందనలు

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ కోసం కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులు, ఉద్యోగులను మంత్రి అభినందించారు. మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

లబ్ధిదారులకు జంబో చెక్కు

కార్యక్రమం ముగింపులో మెప్మా ఆధ్వర్యంలో రూ.3.50 కోట్ల విలువైన జంబో చెక్కును లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పురప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.