A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 6:03 am Posted by : A2TV NEWS

విధి నిర్వహణలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం మృతి

తూప్రాన్‌లో ఛాతినొప్పితో కుప్పకూలిన హెడ్‌ కానిస్టేబుల్‌

మేడ్చల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

మల్కాపూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9:

తూప్రాన్ (8) తూప్రాన్‌లో విధి నిర్వహణకు వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మెదక్‌ జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్‌టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆనందం మంగళవారం చెక్‌పోస్ట్‌ విధుల నిమిత్తం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఛాతినొప్పి రావడంతో తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆనందం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది సీపీఆర్‌ నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆనందం మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది తెలిపారు. విధుల్లో చురుగ్గా ఉంటూ సహచరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని, తన సేవలతో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆనందం ఇక లేరన్న విషయం తెలిసి సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం మృతిపట్ల జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఆనందం అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనందం అంత్యక్రియలను బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.