A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 6:17 am Posted by : A2TV NEWS

ప్రజలకు విశ్వసనీయమైన సర్వే సమాచారమే లక్ష్యం

పునఃసర్వే ప్రక్రియలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల భాగస్వామ్యం

20 మంది అర్హులైన అభ్యర్థులకు లైసెన్సులు జారీ

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15:

మెదక్ జిల్లా (14) జిల్లాలో ప్రజలకు విశ్వసనీయమైన, ఖచ్చితమైన భూ సర్వే సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా పునఃసర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, పునఃసర్వే పనులు చేపట్టేందుకు నిర్దేశించిన అర్హతలు, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 20 మంది అర్హులైన అభ్యర్థులకు లైసెన్సులను లాంఛనంగా అందజేశారు. సర్వే మరియు భూ రికార్డుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది సమక్షంలో లైసెన్సుల జారీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. భూ రికార్డులను నవీకరించడం, వాటిని మరింత మెరుగుపరచడం, భూముల ఖచ్చితమైన సరిహద్దులను నిర్ధారించడం, భూ యజమానులు, ప్రజలకు విశ్వసనీయమైన సర్వే సమాచారాన్ని అందించడం పునఃసర్వే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.లైసెన్స్ పొందిన సర్వేయర్లు సర్వే మరియు భూ రికార్డుల శాఖ నిర్దేశించిన సాంకేతిక విధానాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పునఃసర్వే కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. సర్వేయర్లు తమ విధులను నిష్పక్షపాతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించాలని, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పునఃసర్వే ప్రక్రియలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవడం ద్వారా భూ రికార్డుల్లో మరింత ఖచ్చితత్వం, పారదర్శకత తీసుకురావడంతో పాటు భూ వివాదాలకు అవకాశం తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.డీ. ల్యాండ్‌ సర్వే కిషన్‌, సంబంధిత ల్యాండ్‌ సర్వే సిబ్బంది, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.