A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 1:28 am Posted by : A2TV NEWS

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

ఎన్ హెచ్-44పై బ్లాక్‌స్పాట్‌లను పరిశీలించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

పోలీస్‌, ఎన్ హెచ్ఎ ఐ సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:

మెదక్ జిల్లా (7)జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జాతీయ రహదారి ఎన్ హెచ్-44పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా ఎన్ హెచ్ -44 నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్‌ ఓపెనింగ్‌లు, వాహనాలు యూటర్న్‌ తీసుకునే ప్రాంతాల్లో ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులను ఎస్పీ పరిశీలించారు. ఇందులో భాగంగా బంగారమ్మ టెంపుల్‌, కుచారం గ్రామం వద్ద ఉన్న బ్లాక్‌స్పాట్‌లను పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయని ఎస్పీకి వివరించారు. ముఖ్యంగా వాహనాలు యూటర్న్‌ తీసుకునే ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంటోందని తెలిపారు. అనంతరం ఎస్పీ ఎన్ హెచ్ ఏ ఐ  రీజినల్‌ మేనేజర్‌ రంగారావుతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యామ్నాయ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.డివైడర్‌ ఓపెనింగ్‌లు, గ్రామాల అనుసంధాన రహదారుల వద్ద వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీస్‌, ఎన్ హెచ్ ఏ ఐ   అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌, సీఐలు వెంకట రాజా గౌడ్‌, సందీప్‌ రెడ్డి, మనోహరాబాద్‌ ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌తో పాటు ఎన్ హెచ్ ఏ ఐ  అధికారులు పాల్గొన్నారు.