ఆగస్టు 31లోగా ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 21:
మెదక్: జిల్లాలోని జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను తొలగించి, టీ-ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
కలెక్టరేట్‌లోని అన్ని శాఖలతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్నెట్ వినియోగం, అవసరమైన సామర్థ్యంపై సమగ్ర అంచనాలు రూపొందించి, దానికి అనుగుణంగా టీ-ఫైబర్ సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆగస్టు 31లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ సమీక్షలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఈడీఎం సందీప్, టీ-ఫైబర్ ఇంటర్నెట్ మెదక్ జోనల్ మేనేజర్ ఈశ్వర్, టీ-ఫైబర్ ఇంటర్నెట్ డీఈ వినోద్ తదితరులు పాల్గొన్నారు.