A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:24 am Posted by : A2TV NEWS

విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి మొబైల్‌ వ్యసనానికి దూరంగా ఉంటే భవిష్యత్తు బంగారం

సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి

– అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7:

మెదక్ జిల్లా ( 6) విద్యార్థులు చిన్న వయస్సు నుంచే జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌  సూచించారు. గురువారం మెదక్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో ఆయన పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, జీవితంలో విజయం సాధించేందుకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో అలవర్చుకునే మంచి అలవాట్లే భవిష్యత్తుకు బలమైన పునాదులుగా నిలుస్తాయని చెప్పారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని, అందుకు అవసరమైన విద్య, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమేనని అన్నారు.మొబైల్‌ ఫోన్‌ వినియోగాన్ని నియంత్రించుకోవాలని సూచించిన అదనపు ఎస్పీ, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌, అనవసర వీడియోలతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దన్నారు. “ఈరోజు చేసే చిన్న త్యాగమే రేపటి విజయానికి పునాది” అని పేర్కొంటూ, మొబైల్‌లో గడిపే సమయాన్ని చదువు, నైపుణ్యాల అభివృద్ధికి కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, లింకులను నమ్మవద్దన్నారు. OTPలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అలాగే సోషల్‌ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాల విషయంలో జాగ్రత్త వహించాలని, వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకోవద్దన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్న ఆయన, చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఎస్‌ఐలు నారాయణ, నరేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.