A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 5:09 am Posted by : A2TV NEWS

పరిశ్రమను తొలగించే వరకు పోరాటం ఆగదు: వంటేరు ప్రతాప్ రెడ్డి

అగర్వాల్ ఫౌండరీస్ కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు – రంగాయపల్లి గ్రామస్తుల దీక్షకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు

A2న్యూస్, జూలై 13, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ)

మనోహరాబాద్ (12) లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండరీస్ పరిశ్రమను వెంటనే తొలగించే వరకు పోరాటం ఆపేది లేదని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ ఫౌండరీస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో రంగాయపల్లి, చెట్ల గౌరారం, చెట్ల తిమ్మాయపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పరిశ్రమ లాభాలే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆదివారం రంగాయపల్లి గ్రామంలో గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షకు వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఇప్పటికే పలువురు అనారోగ్యానికి గురయ్యారని, ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై పోరాడి పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమను తొలగించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగాయపల్లి, చెట్ల గౌరారం, చెట్ల తిమ్మాయపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.