ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 20:
మెదక్ జిల్లా (19) మెదక్ జిల్లాలో కోతుల బెడదను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రత్యేక కార్యాచరణతో వేగవంతంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల పంటలను కాపాడడంతో పాటు ప్రజలకు కోతుల బెడద నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పించేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ చాంబర్‌లో కోతుల బెడద నివారణపై అటవీ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, కోతులు పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. కోతుల దాడుల్లో విద్యార్థులు సైతం గాయపడిన ఘటనలు ఉన్నాయని, ప్రజావాణిలో కోతుల బెడదపై అనేక ఫిర్యాదులు, విన్నపాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కోతుల బెడద నుంచి ప్రజలకు, రైతులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. కోతులను పట్టుకోవడం, తరలించడం వంటి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.
కోతులను పట్టుకున్న అనంతరం అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్మల్ జిల్లాకు తరలించి, అక్కడ కుటుంబ నియంత్రణ పద్ధతిలో ఆపరేషన్లు నిర్వహించిన అనంతరం తిరిగి అడవుల్లో విడిచిపెట్టేలా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తద్వారా వాటి సంతతి పెరుగుదలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కోతుల బెడద నియంత్రణను ఒక ఉద్యమంలా చేపట్టి దశలవారీగా ముందుకు సాగితే ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తుందని కలెక్టర్ అన్నారు. సమష్టి కృషితో మెదక్ జిల్లాను కోతుల బెడద నియంత్రణలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి జోజి, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.