A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 6:12 am Posted by : A2TV NEWS

అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు

తప్పుగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసినా చర్యలు తప్పవు – ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్

ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు అందుబాటులోకి

A2న్యూస్, జూలై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (21) నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేసినా, దరఖాస్తులలో తప్పుగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసినా సంబంధిత మీ సేవ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిధిలోని పలు మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, కేంద్రాల నిర్వహణ, సేవల అమలు తీరును పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎస్‌ఎస్‌సీ మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, వ్యవసాయేతర మార్కెట్ విలువ (Non-Agricultural Market Value) వంటి సేవలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు. సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరిస్తామని, ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. కులం, ఆదాయం, నివాసం, జనన, మరణం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, నేటివిటీ, గ్యాప్, నాన్-క్రీమీ లేయర్ వంటి ధ్రువీకరణ పత్రాలను అవసరమైనన్ని సార్లు పొందే సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. మీ సేవ కేంద్రాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ.ఎస్. డి మార్గదర్శకాల ప్రకారం సేవలు అందించాలని ఆదేశించారు. ఆపరేటర్లు ప్రజలకు మీ సేవ, భూభారతి తదితర అన్ని ఆన్‌లైన్ సేవలను సకాలంలో అందించాలని సూచించారు. ప్రతి మీ సేవ కేంద్రంలో సిటిజన్ చార్టర్, భూభారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీ సేవ లోగో, తహసీల్దార్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పరిష్కారం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి, యూడీఐడీ (సదరం), జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర సేవల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నమోదు చేయాలని, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ సేవలు అందించాలని సూచించారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ ఫీజు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందితే సంబంధిత మీ సేవ కేంద్రంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కొత్త డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పాలనాధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇకపై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ నివేదికలు, ఆమోద ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందని వివరించారు. ఈ విధానంతో ప్రస్తుతం ఆదాయం, కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, ఆలస్య జనన–మరణ నమోదు, వ్యవసాయేతర మార్కెట్ విలువ, గ్యాప్ సర్టిఫికెట్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన వెంటనే అది గ్రామ పాలనాధికారి (జీపీవో) లాగిన్‌కు చేరి, అక్కడి నుంచి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, అనంతరం తహసీల్దార్ ఆమోదానికి పంపబడుతుందని వివరించారు. అలాగే కొత్త విధానం ప్రకారం దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తుదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపబడుతుందని తెలిపారు. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన రుసుము వివరాలతో పాటు డిజిటల్ రశీదు కోసం హైపర్‌లింక్ ఉంటుందని చెప్పారు. ఆ లింక్ ద్వారా రశీదును ఎప్పుడైనా వీక్షించడం, డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. దీంతో కాగితపు రశీదులు పోయే ఇబ్బందులు ఉండవని, అవసరమైతే తిరిగి అదే సందేశాన్ని పంపించే సౌకర్యం కూడా కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.