ఆపరేషన్ ముస్కాన్‌లో 78 మంది చిన్నారుల రక్షణ – జిల్లాలో 50 కేసుల నమోదు
ఆపరేషన్ ముస్కాన్ బృందాల సమస్యలు, సవాళ్లను తెలుసుకున్న ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, జులై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (22) బాలల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారి బాల్యాన్ని విద్యకు అంకితం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో భారత్ ముందంజలో ఉందని, ఈ యువతే దేశ భవిష్యత్తుకు బలమని పేర్కొన్నారు. జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో బాల కార్మికులను గుర్తించి వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు. రక్షించిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం అప్పగించాలని, అవసరమైతే సంరక్షణ గృహాలకు తరలించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన 20 రోజుల్లో జిల్లాలో 78 మంది చిన్నారులను రక్షించినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 50 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్ బృందాలు విధుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు, బాల కార్మికుల గుర్తింపు, రక్షణ చర్యల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరంగా తెలుసుకుని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. బాలల భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమన్వయ సమావేశంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ జార్జ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతేంద్ర ప్రసాద్, విద్యా, వైద్య శాఖల అధికారులు, ఎన్‌జీవో ప్రతినిధులు, రెండు డివిజన్లకు చెందిన ఆపరేషన్ ముస్కాన్ బృందాల సభ్యులు పాల్గొన్నారు.