లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి — విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 13:
మెదక్ జిల్లా (12) జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టడంతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసును నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఎస్పీ సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు శిక్షపడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాలని, నేరాల నియంత్రణలో భాగంగా బ్లూకోల్ట్స్, నైట్ పెట్రోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను జియోట్యాగింగ్ చేయాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఓవర్‌లోడ్ వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య తదితర అప్లికేషన్లలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభకు ప్రశంసా పత్రాలు
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సీఐలు మహేష్, రేణుక, వెంకట రాజా గౌడ్, సైదా, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, రంగకృష్ణతో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.