A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 5:39 am Posted by : A2TV NEWS

ఎస్ ఐ ఆర్–2026పై 30–40 రోజులు ప్రత్యేక దృష్టి

అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి

ఫారం–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22:

మెదక్ జిల్లా (21)ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపడుతూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చివరి నిమిషం వరకు దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ముందుగానే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అక్టోబర్ చివరి వారంలోగా అనామలీస్, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పరిష్కార ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్–2026కు సంబంధించిన అన్ని పనులను అక్టోబర్ 25లోపు పూర్తి చేసి, చివరి 10 రోజులను అవసరమైన సవరణలు, ఇతర ప్రక్రియల కోసం కేటాయించుకోవాలని ఆదేశించారు.

ఫారం–6తో డిక్లరేషన్ తప్పనిసరి

ఫారం–6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఫారం–6తో పాటు అవసరమైన డిక్లరేషన్, సంబంధిత పత్రాలను సమర్పించేలా అర్హులైన ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లకు జారీ చేసే నోటీసులను బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో బీఎల్‌ఏలు ఇళ్లను గుర్తించడంలో సహకరించవచ్చని తెలిపారు. అయితే బీఎల్‌ఏల ద్వారా నోటీసులు పంపిణీ చేసినట్లు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌ఓపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు విచారణకు హాజరై, సంబంధిత పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. ఈ విషయంపై బీఎల్‌ఓలు సంబంధిత ఓటర్లకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష

బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించాలని సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కారం తదితర ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గఫర్ తదితరులు పాల్గొన్నారు.