A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 6:31 am Posted by : A2TV NEWS

ప్రజావాణిలో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండొద్దు..

సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ఆదేశాలు

A2న్యూస్, జులై 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (6)ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన వినతులను సమర్పించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని, ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతను పాటించడం మెదక్ జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయం లేదా సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.