A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 6:02 am Posted by : A2TV NEWS

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయాలి

భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

A2న్యూస్, జులై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా ( 21) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అన్ని జిల్లాల్లో వేగవంతంగా పూర్తి చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పూర్తి పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, ఎన్నికల సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.