A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:12 am Posted by : A2TV NEWS

టేక్మాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12:

టేక్మాల్‌ (11) పోలీస్‌స్టేషన్‌ను మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధుల నిర్వహణను ఆయన పరిశీలించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణలో భాగంగా రాత్రి గస్తీ, వాహన తనిఖీలు, నాకాబందీలను మరింత పటిష్ఠంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రౌడీషీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా

రౌడీషీటర్లు, సస్పెక్ట్స్‌ షీట్స్‌లో ఉన్న వ్యక్తులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. వారి ప్రస్తుత కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల పునరావృతాన్ని అరికట్టేందుకు బీట్‌ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా గ్రామాలు, విద్యాసంస్థల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డ్రగ్స్‌ రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

సైబర్‌ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి

నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ప్రతి ఫిర్యాదును సక్రమంగా నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ పోలీసుశాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐలు రేణుకరెడ్డి, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ అరవింద్‌ ఉన్నారు.