A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:03 am Posted by : A2TV NEWS

టౌన్‌ పీఎస్‌లో ఎస్పీ తనిఖీ.. పెండింగ్‌ కేసులపై ప్రత్యేక ఫోకస్‌

పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి

సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి

– మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4:

మెదక్‌ జిల్లా ( 3): మెదక్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సాంకేతిక వ్యవస్థల అమలు తీరును పరిశీలించారు. టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ నుంచి స్టేషన్‌కు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ.. కెమెరాల రికార్డింగ్‌, స్టేషన్‌ పరిసరాలపై నిఘా తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్‌ ప్రాంగణంలో సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించి, వాటికి సంబంధించిన కేసుల వివరాలను తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌, జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈ-సాక్ష్యలో నిబంధనల ప్రకారం నమోదు చేసి భద్రపరచాలని సూచించారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంతో పాటు రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.పెండింగ్‌ రిపోర్టులను త్వరితగతిన పూర్తి చేసి, పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ కేసుల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌ సేవలు అందిస్తూ పోలీస్‌ శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐలు సందీప్‌రెడ్డి, మహేష్‌, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.