A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:39 am Posted by : A2TV NEWS

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జూలై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (14) ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కొల్చారం మండలం వరిగుంటం గ్రామంలో తహసీల్దార్, ఎంపీడీవోతో కలిసి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు సర్వేను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిపై ఆరా తీశారు. ఫారాలు పంపిణీ చేయడమే కాకుండా, పూర్తిగా నింపిన దరఖాస్తులను తిరిగి సేకరించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరినీ సంప్రదించాలని, ఒక కుటుంబంలో ఒక సభ్యుడి మ్యాపింగ్ పూర్తయితే మిగిలిన అర్హులైన సభ్యుల వివరాలు కూడా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఫారాలు సమర్పించని కుటుంబాలను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సంప్రదించి దరఖాస్తులు అందేలా చూడాలని పేర్కొన్నారు. మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బీఎల్ఓలు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహకారం అందించి ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.