A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 5:22 am Posted by : A2TV NEWS

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వరాల జల్లు

12 కాటేజీల నిర్మాణానికి 7 కోట్ల నిధులు మంజూరు

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధికి ఊతం

A2న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

పాపన్నపేట(29) దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక చొరవతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కీలక చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో కనీస వసతి సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఆలయ ప్రాంతంలో 12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్ల నిధులు మంజూరైనట్లు సమాచారం. ఈ విషయాన్ని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక కార్యదర్శి వాణి ప్రసాద్ వెల్లడించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. “అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రజల ఆశీస్సులు, అమ్మవారి కరుణతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం” అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ నిధులు ఆలయ అభివృద్ధికి కొత్త ఊపునివ్వడంతో పాటు, భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.