ఐసీజేఎస్ పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది నియామకం
తూప్రాన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయ తనిఖీలో మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 :
మెదక్ జిల్లా, తూప్రాన్ (24) ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత గడువులోగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి, పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐజీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయ ప్రాంగణంలో మియాజాకి జాతికి చెందిన అరుదైన మామిడి మొక్కను నాటారు. తదుపరి కార్యాలయంలోని రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో కేసుల్లో సమగ్రంగా, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో నిర్దేశిత ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
ఐసీజేఎస్‌పై ప్రత్యేక పర్యవేక్షణ
ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఐజీ సూచించారు.
ఈ-సాక్ష్య ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, కేసుల స్వభావాన్ని బట్టి నిర్ణీత గడువులోగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు న్యాయ ప్రక్రియలో భాగంగా అందాల్సిన పరిహారం ఆలస్యం కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు
దొంగతనాల నివారణకు రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, అనుమానిత వాహనాల తనిఖీలు చేపడుతూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయిన నిందితులను త్వరగా గుర్తించి, న్యాయస్థానాల్లో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు ప్రతి నెల కనీసం రెండు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, రికార్డుల నిర్వహణను సమీక్షించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని తెలిపారు.
గంజాయి, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కార్యాలయాల్లో 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని ఐజీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తనిఖీలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు సైదా, వెంకట రాజా గౌడ్, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.