A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 6:56 am Posted by : A2TV NEWS

ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారానే సబ్సిడీ ఎరువుల విక్రయాలు:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6:

మెదక్ జిల్లా (5) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ ఎఫ్ ఎస్)  డిజిటల్ యాప్ ద్వారా 2026 ఆగస్టు 6 నుంచి అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో అమలులో ఉన్న యూరియా బుకింగ్ యాప్ ద్వారా ప్రధానంగా యూరియా విక్రయాలు మాత్రమే నమోదయ్యేవని, ఇకపై  ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ (డి ఏ పి), ఎంఓపీ (ఎం ఓ పి), ఎన్పీకే (ఎన్ పి కే) కాంప్లెక్స్‌తో పాటు అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు ఒకే డిజిటల్ వేదికపై నిర్వహించబడతాయని తెలిపారు. ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు, సబ్సిడీ, విక్రయాల పర్యవేక్షణ వంటి అన్ని ప్రక్రియలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఎఫ్ ఎఫ్ ఎస్ వ్యవస్థతో ఎరువుల పంపిణీలో సంపూర్ణ పారదర్శకత ఏర్పడడంతో పాటు రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే నిల్వలు, విక్రయాలు, సబ్సిడీ ప్రక్రియలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు.

రైతులు ఎరువులు పొందే విధానం

రైతులు ముందుగా తమ మొబైల్ నంబర్‌తో  ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం సాగు పంట, సాగు విస్తీర్ణం, అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసి సమీపంలోని ఎరువుల డీలర్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం యాప్ రూపొందించే ప్రత్యేక క్యూఆర్  కోడ్‌ను సంబంధిత డీలర్‌కు చూపించాలి. డీలర్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలను ధృవీకరించిన తర్వాత రైతులకు ఎరువులు అందజేస్తారు. విక్రయ వివరాలు వెంటనే కేంద్ర ఎఫ్ ఎఫ్ ఎస్ సర్వేలో నమోదవుతాయి.

రైతులకు కలిగే ప్రయోజనాలు

ఈ విధానంతో ఎరువుల కోసం అనవసర నిరీక్షణ తగ్గడంతో పాటు సరైన రైతుకు సరైన ఎరువు అందేలా పారదర్శక వ్యవస్థ అమలవుతుంది. ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉండటంతో పాటు సబ్సిడీ పంపిణీ మరింత సమర్థవంతంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

రైతులకు ముఖ్య సూచనలు

ప్రస్తుతం అమలులో ఉన్న పాత ఎరువుల విక్రయ యాప్ ద్వారా ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విక్రయాలు నిర్వహించబడతాయని, ఆగస్టు 6 నుంచి పూర్తిగా ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారానే అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు జరుగుతాయని తెలిపారు. ఎఫ్ ఎఫ్ ఎస్ నమోదు, QR కోడ్ లేదా ఎరువుల కొనుగోలు విధానంపై ఏవైనా సందేహాలు ఉంటే తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఈ ఓ)ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎఫ్ ఎఫ్ ఎస్  విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా సుమారు 2,846 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన మేరకే ఎరువులు కొనుగోలు చేసి వినియోగించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.