A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 9:04 pm Posted by : A2TV NEWS

కొత్తపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ.. సంప్రదాయ పాటలతో మార్మోగిన గ్రామం A2న్యూస్, మనోహబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ)

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 19:

శివంపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ, బతుకమ్మ పాటలను భక్తిశ్రద్ధలతో ఆలపించారు. పూల సోయగాలు, మహిళల కోలాహలం, సంప్రదాయ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. శివంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ వేడుకల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలంతా కలిసికట్టుగా జరుపుకోవడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ వేడుకలు చాటిచెప్పాయి.ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు