పోలీస్ శాఖకు అందించిన సేవలు అమూల్యం: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:
మెదక్ జిల్లా (31)మెదక్ జిల్లా పోలీస్ శాఖలో 36 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించిన ఏఎస్సై తుకారాం ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తుకారాంను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజమైన ప్రక్రియేనని, అయితే పోలీస్ శాఖలో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. 1992లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉమ్మడి మెదక్ జిల్లాలో సేవలను ప్రారంభించిన తుకారాం, 36 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో వివిధ పోలీస్ స్టేషన్లలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ విశేష సేవలు అందించారని కొనియాడారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వహిస్తూ సర్వీస్ కాలమంతా ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీస్ శాఖకు తుకారాం అందించిన సేవలు అమూల్యమైనవని, ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా పోలీస్ శాఖ కుటుంబ సభ్యుల మాదిరిగానే అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. తుకారాంకు రావాల్సిన అన్ని రకాల పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీస్ శాఖను సంప్రదించవచ్చని సూచించారు. తుకారాంకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరఫున ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఏఎస్సై తుకారాం మాట్లాడుతూ.. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేసిన అనుభవాలు, సహచరులతో ఏర్పడిన అనుబంధం జీవితాంతం మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఏఎస్సై తుకారాం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.