A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 5:51 am Posted by : A2TV NEWS

కేసుల దర్యాప్తులో నాణ్యతకు పెద్దపీట వేయాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

సాంకేతికతతో సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలి – పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (27) కేసుల దర్యాప్తులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణ, స్వాధీన వాహనాల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసిన ఎస్పీ, పోలీసు సిబ్బంది బస్వరాజ్‌కు రివార్డు ప్రకటించారు. శాఖ అందించిన సామగ్రిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి, అన్ని రకాల విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ప్రస్తుతం నేర్చుకుంటున్న అంశాలు సేవా కాలమంతా ఉపయోగపడతాయని తెలిపారు. స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ, ప్రతి కేసులో శాస్త్రీయ, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి గ్రామ పెద్దలు, యువతతో సమన్వయం కొనసాగించాలని తెలిపారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదేవిధంగా సీసీటీఎన్‌ఎస్–2.0, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి సాంకేతిక వేదికలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, స్టేషన్ రికార్డులను ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించిన ఎస్పీ, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ తనిఖీలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.