A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:46 am Posted by : A2TV NEWS

నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మనోహరాబాద్, జూన్ 23: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి, వివిధ స్టాళ్లలో ప్రదర్శించిన వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాల్లో సన్న వడ్లు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.వర్షాభావ పరిస్థితుల్లో యూరియాను అధిక మోతాదులో వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని పేర్కొంటూ, రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో సుమారు 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల అధిక ధాన్యం కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి నాణ్యమైన విత్తనం అత్యంత కీలకమని, మంచి పంటకు విత్తనమే పునాది అని అన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార విక్రయ కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయకుండా, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ధ్రువీకరించిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు, ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని తెలిపారు. విత్తన మేళాల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పంట వంగడాలు, వాటి ప్రత్యేకతలు, దిగుబడి సామర్థ్యం, తెగుళ్ల నిరోధకత వంటి అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే, వర్షాభావాన్ని తట్టుకునే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందగలరని తెలిపారు.వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం, పురుగుమందుల నిర్వహణ తదితర అంశాలపై రైతు వేదికలను శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని, నాణ్యమైన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి రైతు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల సాగు చేపడితే దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయ వ్యయాలు కూడా తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన విత్తనం, సరైన సాగు పద్ధతులు, సమయానుకూల వ్యవసాయ సలహాలతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, వాటి ప్రయోజనాలపై గ్రామస్థాయి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో బావయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్, సర్పంచ్ అనూష భాస్కర్ యాదవ్, ఏఎంసీ చైర్‌పర్సన్ కీర్తన విట్టల్ రెడ్డి, ఏడీఏ (టెక్నికల్) వినయ్, ఏడీఏ నర్సాపూర్ సంధ్య, మండల వ్యవసాయ అధికారి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.