A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:14 am Posted by : A2TV NEWS

సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన పోలీసింగ్ అందించాలి

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమగ్ర తనిఖీ

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 9:

మనోహరాబాద్ (8) ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని మల్టీ జోన్–I ఐజీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు తీరు, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు, సాంకేతిక వనరుల వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సాంకేతిక వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి

పోలీసు శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని ఐజీ సూచించారు. సీసీటీఎన్ఎస్–2.0, ఈ–సాక్ష్య, టీఎస్–కాప్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీ తదితర వ్యవస్థలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, బాధితులు మరియు ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. డయల్–112 కాల్స్‌కు తక్షణ స్పందన, విజిబుల్ పోలీసింగ్, బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.పోలీసు సిబ్బంది సమస్యలపై ఆరా

అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఐజీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలీసు సిబ్బంది ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంచేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

హోంగార్డు తజ్జుద్దీన్‌కు ఐజీ అభినందనలు

ఈ సందర్భంగా హోంగార్డు తజ్జుద్దీన్ తన ఇద్దరు కుమార్తెలను ఎంబీబీఎస్ చదివిస్తున్న విషయాన్ని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తూనే తన కుమార్తెలకు ఉన్నత విద్య అందిస్తున్న తజ్జుద్దీన్‌ను ఐజీ అభినందించారు. కష్టపడి పనిచేస్తూ పిల్లల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకమని ఐజీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ తనిఖీలో మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజా గౌడ్, సుభాష్ గౌడ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.