A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:26 am Posted by : A2TV NEWS

జనాభా లెక్కలతోనే సరైన అభివృద్ధి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 14:

మెదక్ జిల్లా (13) ప్రణాళికాబద్ధమైన భవిష్యత్‌ అభివృద్ధికి జనాభా లెక్కలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణన–2027 సన్నాహకాల్లో భాగంగా రూపొందిస్తున్న జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ తయారీపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. జనగణన–2027 సన్నాహకాల్లో భాగంగా మున్సిపల్‌, విద్య, వైద్య ఆరోగ్య, హౌసింగ్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల వారీగా జనాభా వివరాలను నమోదు చేయడంతో పాటు మౌలిక వసతులు, విద్య, వైద్యం, పౌర సౌకర్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలన్నారు. డిజిటల్ యాప్‌లు, వెబ్ పోర్టల్స్ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని క్రోడీకరించాలని, రెవెన్యూ గ్రామాల స్థాయిలో సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.ఖచ్చితమైన జనాభా గణాంకాల ఆధారంగానే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించగలమని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్‌, ఆర్డీవోలు రమాదేవి, రామకృష్ణ, బవయ్య, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.