చేగుంట–బోనాల రహదారిపై వాహనదారుల అవస్థలు.. అధికారులు ఇకనైనా మేల్కొనాలి
A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 15 :
చేగుంట(14) మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని చేగుంట–అనంతసాగర్–రుక్మాపూర్–ఇబ్రహీంపూర్–బోనాల మార్గంలో రహదారి అధ్వానంగా మారి వాహనదారులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా బ్రిడ్జిల వద్ద ఏర్పడిన భారీ గుంతలు వర్షాలకు మరింత లోతుగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. బ్రిడ్జిల వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు ప్రత్యక్ష ఆహ్వానం పలుకుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రహదారి భద్రతపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షం పడిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో వాటి లోతు కనిపించక ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్న గుంతను పెద్ద ప్రమాదంగా మారే వరకు అధికారులు వేచి చూస్తున్నారా? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జిల వద్ద ఉన్న గుంతలను తక్షణమే పూడ్చి, రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి వాహనదారులకు ప్రమాదరహిత ప్రయాణాన్ని కల్పించాలని స్థానికులు, వాహనదారులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడమే అధికారుల బాధ్యత అని వారు స్పష్టం చేస్తున్నారు.