A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:33 am Posted by : A2TV NEWS

ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18:

మెదక్ జిల్లా (17) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పాలన, ప్రజల భాగస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను గుర్తుచేసుకునే రోజుగా ప్రజాపాలన దినోత్సవానికి ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక బాధ్యతను నిర్వహిస్తోందన్నారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులను సత్వరం స్వీకరించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్రబోస్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.