A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 6:51 am Posted by : A2TV NEWS

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం : కలెక్టర్ ప్రతిమా సింగ్

– ‘ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ’ థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

– భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ

– యోగాసనాలు వేసి అందరినీ ఉత్తేజపరిచిన కలెక్టర్

A2 న్యూస్, జూన్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ :(21) యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని, వయోభేదం, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఆదివారం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భూక్య జ్ఞానేశ్వర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివదయాల్, ఆయుష్ విభాగం అధికారి మోహన్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్, ప్రముఖ యోగా గురువు ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీవో రమాదేవి స్వయంగా యోగాసనాలు చేస్తూ పాల్గొన్నారు. యోగా గురువు ఆకుల రవి వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ అధికారులు, విద్యార్థులు, యువతతో సాధన చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘‘మన నవశక్తులన్నింటినీ ఏకం చేసే ఏకాగ్రతను సాధించడం యోగ ద్వారానే సాధ్యం. యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు. ఇది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి’’ అని అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ అని పేర్కొంటూ, యోగ సాధన ద్వారా ఆరోగ్యవంతమైన వృద్ధాప్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరంతరం యోగ సాధన చేయాలని సూచించారు. అనంతరం యోగాలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి కలెక్టర్ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, యోగా ఇన్‌స్ట్రక్టర్ దేవేందర్ రెడ్డి, పీడీ ఆనందం, నరసింహులు, కొండల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.