A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 6:21 am Posted by : A2TV NEWS

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జులై 30:

మెదక్ జిల్లా (29) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వర్షాల పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాడుబడిన ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లను అధికారులు పరిశీలించి, ఎవరైనా నివసిస్తే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని హెచ్చరించారు. వరద నీటిలో ప్రయాణించడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, అలాంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల ప్రజలు నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు తమ వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలను సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని చెప్పారు. భారీ వర్షాల సమయంలో వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్త వహించాలని, నీరు నిలిచిన రహదారులపై అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.జిల్లా యంత్రాంగం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచిందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే వర్షాల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.