A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 8:03 am Posted by : A2TV NEWS

పటిష్ఠ బందోబస్తుతో ప్రశాంతంగా మిలాద్‌-ఉన్‌-నబీ

పోలీసుల భద్రతా చర్యలకు అభినందనలు.. ఎస్పీని సన్మానించిన జమాత్‌-ఇ-ఇస్లామీ ప్రతినిధులు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10:

మెదక్‌ జిల్లా (9) మిలాద్‌-ఉన్‌-నబీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు విజయవంతం కావడంతో జమాత్‌-ఇ-ఇస్లామీ ప్రతినిధులు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పండగ సందర్భంగా ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, ఊరేగింపు మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో మిలాద్‌-ఉన్‌-నబీ పండగ ప్రశాంతంగా ముగియడం సంతోషకరమన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతోపాటు మత పెద్దలు, ప్రజలు అందించిన సహకారం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన మత పెద్దలు, ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో పండగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.