A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:26 am Posted by : A2TV NEWS

ఒక్క ఓటీపీ.. మొత్తం ఖాతా స్వాహా!

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. అత్యాశ, భయం, తొందరపాటే నేరగాళ్ల ఆయుధాలు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2:

మెదక్‌ జిల్లా (1) చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. ప్రపంచమే అరచేతిలోకి వచ్చినట్లే. బ్యాంకింగ్‌ నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకు.. నగదు బదిలీల నుంచి ప్రభుత్వ సేవల వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయితే ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొత్తకొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్క ఫోన్‌కాల్‌.. ఒక్క లింక్‌.. ఒక్క ఓటీపీతో జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును క్షణాల్లో కాజేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. బ్యాంకు అధికారులమంటూ ఖాతా బ్లాక్‌ అవుతుందని భయపెట్టడం.. పోలీసులమంటూ కేసు నమోదైందని బెదిరించడం.. ఉద్యోగం, లోన్‌, లాటరీ, బహుమతుల పేరుతో ఆశ చూపించడం వంటి ఎత్తుగడలతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీ, యూపీఐ పిన్‌, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. గుర్తుతెలియని లింకులపై క్లిక్‌ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, మొబైల్‌ స్క్రీన్‌ను ఇతరులతో షేర్‌ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే భయపడకుండా వెంటనే 1930కు కాల్‌ చేయాలని ఎస్పీ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. వివరాలు చెప్పే ముందు ఒక్కసారి ఆగండి.. అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. ప్రజల అప్రమత్తతే సైబర్‌ నేరగాళ్లకు అసలైన అడ్డుకట్ట అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.