A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:35 am Posted by : A2TV NEWS

ఆగస్టు 15న కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు కూడా విడుదల చేయాలి

దివ్యాంగుల పెన్షన్‌ను 6 వేల వరకు పెంచాలి: తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:

సిద్దిపేట జిల్లా (7) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు తదితరులకు కొత్త పెన్షన్లు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న పాత లబ్ధిదారులకు కూడా పెరిగిన పెన్షన్‌ను వెంటనే అమలు చేసి విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షులు కెమ్మసారం అశోక్ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు, దివ్యాంగుల పెన్షన్‌ను 4 వేల నుంచి 6 వేల వరకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అదేవిధంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వివిధ వర్గాల పెన్షన్‌దారులకు కూడా 2 వేల నుంచి 4 వేల వరకు పెన్షన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని తెలిపారు. “కొత్త పెన్షన్‌దారులకు మాత్రమే పెరిగిన పెన్షన్లు అందించి, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న పాత లబ్ధిదారులను విస్మరించవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్‌దారులకు కూడా పెరిగిన మొత్తంతో పెన్షన్లు విడుదల చేయాలి” అని కెమ్మసారం అశోక్ కోరారు. ముఖ్యమంత్రి పదవీకాలం మరో ఏడాదిలో ముగిసే అవకాశం ఉన్నప్పటికీ, దివ్యాంగులు మాత్రం జీవితాంతం తమ వైకల్యంతోనే జీవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేసి దివ్యాంగులకు, ఇతర పెన్షన్‌దారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15వ తేదీన కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్‌దారులకు కూడా పెంచిన పెన్షన్లు విడుదల చేయని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ ఏకం చేసి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కెమ్మసారం అశోక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.