అత్యవసరమైతేనే సెలవులు మంజూరు – కలెక్టర్ ప్రతిమా సింగ్
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: 9391942254
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 31:
మెదక్ జిల్లా (30) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా అధికారులు సెలవులు పెట్టవద్దని స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వర్షాల పరిస్థితులను తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర అవసరాలు ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు రోపులు, డ్రోన్లు తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, అత్యవసర సమాచార స్వీకరణ కోసం కలెక్టరేట్‌లో 9391942254 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చెరువులు, కల్వర్టులు, కుంటలు తదితర ప్రాంతాల్లో నీటి ప్రవాహం అధికంగా ఉండే చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పైకప్పులు లీకేజీ ఉన్నట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు నివసించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దూప్ సింగ్ తండా ప్రాంతంలో వర్షపు నీటి ఉద్ధృతి పెరిగే అవకాశమున్నందున ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సెక్రటరీలు, ఎంపీవోలు సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్ నిర్వహించాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలని, పాము కాటు, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు తగినంత నిల్వ ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.