A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 5:52 am Posted by : A2TV NEWS

మెదక్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22:

మెదక్ జిల్లా (21) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికలను 2026 అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తుది సభ్యుల జాబితాను కూడా ప్రచురించినట్లు వెల్లడించారు. ఎన్నికల కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ కమిటీ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ మెదక్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరుగుతుంది. సెప్టెంబర్ 25న ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టి, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణ, తుది నామినేషన్ల జాబితా ప్రచురణతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపడతారు. అవసరమైన పక్షంలో అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ మెదక్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, లెక్కింపు పూర్తయిన అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం ఆఫీస్ బేరర్ల ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

నామినేషన్ ఫీజు రూ.10 వేలు

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు రూ.10,000 నామినేషన్ ఫీజును తిరిగి చెల్లించబడని రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. నామినేషన్ ఫారాలను ఎన్నికల అధికారిని వ్యక్తిగతంగా సంప్రదించడం ద్వారా లేదా రాతపూర్వక అభ్యర్థన సమర్పించి అధీకృత వ్యక్తి ద్వారా సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొందవచ్చని పేర్కొన్నారు.

ఫోటో గుర్తింపు తప్పనిసరి

పోలింగ్ కేంద్రానికి వచ్చే సొసైటీ సభ్యులు గుర్తింపు కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఫోటో గుర్తింపునకు సంబంధించిన ఆధారాన్ని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఎన్నికల అధికారి సూచించారు. ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9346999257 ఫోన్ నంబర్‌లో ఎన్నికల అధికారిని సంప్రదించాలని తెలిపారు.