A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:49 am Posted by : A2TV NEWS

ప్రజావాణి ఫిర్యాదులపై జాప్యం వద్దు: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 4:

మెదక్ (3 )ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, కుటుంబ, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను సమర్పించారు. ప్రతి ఫిర్యాదుపై చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా, ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించడం మెదక్ జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయం, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హామీ ఇచ్చారు.