పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలి.. వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు
వీపీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12 :
మెదక్ జిల్లా (11) జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రేవ్, నాన్‌గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల దర్యాప్తు పురోగతిని ఎస్పీ సమీక్షించారు. కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా దర్యాప్తు పూర్తి చేసి సకాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గ్రేవ్ కేసుల్లో సంఘటనా స్థలంలో లభించే ఆధారాలను పకడ్బందీగా సేకరించి, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా పటిష్ఠమైన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించి బాధితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, ఎన్‌బీడబ్ల్యూ కేసుల్లో వారెంట్ల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు
రాబోయే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీపీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసలు
నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసిన ఐఓలు రేణుకరెడ్డి, వెంకటరాజాగౌడ్, రంగా కృష్ణతో పాటు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు సుభాష్‌చంద్రబోస్, నరేందర్‌గౌడ్, సీఐలు రేణుక, రాజశేఖర్‌రెడ్డి, వెంకటరాజాగౌడ్, జార్జ్, సందీప్‌రెడ్డి, కృష్ణమూర్తి, రంగా కృష్ణ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.