A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:09 am Posted by : A2TV NEWS

ఏడాదిలోగా మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీ భవనాలు పూర్తి చేయాలి

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4:

మెదక్ జిల్లా (3) గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఏడాదిలోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోఠిలోని తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలో గురువారం మెదక్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పురోగతి, మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులు, మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. సుమారు రూ.156 కోట్లతో చేపడుతున్న మెదక్ మెడికల్ కాలేజీ, హాస్టల్స్, నర్సింగ్ కాలేజీ భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా అన్ని భవనాలను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ప్రస్తుతం కాలేజీలు, హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈని మంత్రి ఆదేశించారు. మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీలు, హాస్టల్ భవనాలను వెంటనే సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే అన్ని సౌకర్యాలు ఉన్న ఇతర భవనాలను అద్దెకు తీసుకుని హాస్టళ్లను అక్కడికి మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, సుమారు రూ.40 కోట్లతో నిర్మించిన సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి తెలిపారు. భవనం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం పాత భవనంలో కొనసాగుతున్న మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు త్వరలోనే కొత్త భవనాలను మంజూరు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.