A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 6:54 am Posted by : A2TV NEWS

ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్‌లో మెదక్ జిల్లా 100 శాతం పూర్తి

మెదక్‌లో 91.51 శాతం.. నర్సాపూర్‌లో 89.59 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12:

మెదక్ జిల్లా (11) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా మెదక్ జిల్లాలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం జూన్ 25న ప్రారంభమైందని, తొలిదశలో జూన్ 25 నుంచి 30 వరకు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలను సేకరించడంతో పాటు ఓటర్ల వివరాల పరిశీలన, డిజిటలైజేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 2,20,427 మంది ఓటర్లు ఉండగా, 2,01,705 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 91.51 శాతం కాగా, 18,722 మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించారు. వీరిలో 5,431 మంది మృతి చెందినవారు, 3,433 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నవారు, 8,948 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 874 మంది ఆచూకీ లభించనివారు, 36 మంది ఇతర కారణాలతో ఉన్నట్లు వెల్లడించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం 2,32,713 మంది ఓటర్లు ఉండగా, 2,08,499 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది 89.59 శాతం. మిగిలిన 24,214 మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించారు. వీరిలో 7,735 మంది మృతి చెందినవారు, 3,414 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నవారు, 12,153 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 634 మంది ఆచూకీ లభించనివారు, 278 మంది ఇతర కారణాలతో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. డిజిటలైజేషన్ పూర్తయిన ఓటర్లు, వివిధ కారణాలతో అన్‌కలెక్టబుల్‌గా గుర్తించిన ఓటర్ల వివరాలను కలిపి జిల్లాలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులో సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలను కలెక్టర్ అభినందించారు.