A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 13:
నర్సాపూర్ (12) విద్యార్థుల విజ్ఞాన సముపార్జన, అకడమిక్ అభివృద్ధిలో గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తుందని బీవీఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే అన్నారు. బుధవారం బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) సరస్వతి బ్లాక్‌లోని సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా.ఎస్.ఆర్. రంగనాథన్ జయంతినిపురస్కరించుకుని 134వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. సంజయ్ దూబే మాట్లాడుతూ గ్రంథాలయంలోని పుస్తకాలు, ఈ-వనరులు, ఇతర సమాచార వనరులను విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి గ్రంథాలయం ముఖ్యమైన ఆధారమని అన్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు విజ్ఞాన, సాహిత్య పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలిపారు. డీన్–ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ డా. బంగారు రాజు మాట్లాడుతూ మంచి పఠన అలవాట్లు,సమయపాలన, నిరంతర అభ్యాసం విద్యార్థుల విజయానికి దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం తో పాటు అకడమిక్ మరియు ప్లేస్మెంట్ శిక్షణకు ముందుగానే సిద్ధం కావాలని సూచించారు. ఈసీఈ విభాగాధిపతి డా. సంజీవ రెడ్డి, ఫార్మాస్యూటికల్‌ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. పి. విష్ణు మాట్లాడుతూ విద్యార్థులు రోజువారీ జీవితంలో పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం లైబ్రేరియన్ డా. ఎ. మల్లికార్జున్ మాట్లాడుతూ బీవీఆర్‌ఐటీ సెంట్రల్ లైబ్రరీలో అధునాతన పుస్తకాలు, అంతర్జాతీయ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధనా ప్రచురణలు, గేట్, సివిల్స్, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పుస్తకాలు, డిజిటల్ లైబ్రరీ, కిండిల్ ఈ-బుక్స్, ప్రింట్ జర్నల్స్, మ్యాగజైన్లు తదితర వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయ సేవలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. లైబ్రరీ సిబ్బంది శ్రీ వాణి,రవి నాయక్, ఎస్. రాజు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టి.ఎల్.ఎన్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.