15 డొమెస్టిక్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ స్వాధీనం
అక్రమ రీఫిల్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2:
మెదక్ (1) మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం హెచ్చరించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆగస్టు 1న చేగుంట మండలంలోని మక్కరాజుపేట గ్రామంలో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్, రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారులతో కలిసి మూడు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వంజరి రాజుకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రిపేర్ షాప్‌లో 7 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, అగతదివిటి సురేష్‌కు చెందిన గంగ లైట్ హౌస్‌లో 2 డొమెస్టిక్ సిలిండర్లు, మహేందర్‌కు చెందిన లక్ష్మీ నరసింహ సీడ్స్ షాప్‌లో 6 డొమెస్టిక్ సిలిండర్లు, ఒక కమర్షియల్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. మొత్తం 15 డొమెస్టిక్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను చేగుంటలోని దేవి భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై అత్యవసర వస్తువుల చట్టం–1955లోని సెక్షన్ 6-ఎ కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే చేగుంట పోలీస్ స్టేషన్‌లో కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం మాట్లాడుతూ, మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై, అలాగే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.