A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 7:16 am Posted by : A2TV NEWS

చట్టబద్ధంగా, పారదర్శకంగా ఫిర్యాదుల పరిష్కారం

ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 25 :

మెదక్ జిల్లా (24)  ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలపై ఫిర్యాదులను సమర్పించారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి వినతిదారుడి సమస్యను బాధ్యతగా పరిగణించి, ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని అధికారులకు సూచించిన ఎస్పీ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయం, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని కోరారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.