A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:
మెదక్ జిల్లా (31)ఓటరు నమోదు వివరాలను తెలుసుకోవడం ఇప్పుడు మరింత సులభమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇంకా కేవలం మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రతి ఓటరు తమ ఎన్నికల గుర్తింపు కార్డు (EPIC) నంబర్‌ను టైప్ చేసి 1950 నంబర్‌కు SMS పంపడం ద్వారా తమ ఓటరు వివరాలను మొబైల్ ఫోన్‌కు సందేశం రూపంలో పొందవచ్చని వివరించారు. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ ఓటు హక్కు నమోదును నిర్ధారించుకోవాలని సూచించారు. అవసరమైతే ఓటరు వివరాల్లో సవరణలు, కొత్త ఓటరు నమోదు లేదా ఇతర మార్పులను గడువు ముగిసేలోపు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రజలు ఓటు హక్కు విలువను గుర్తించి, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఎన్నికలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.