A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:14 am Posted by : A2TV NEWS

అంతర్జాతీయ పరిజ్ఞానం

– అనర్గళ వాక్చాతుర్యంతో మెరిసిన మెదక్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి ఆదర్శ ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో 9 మంది విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

A2న్యూస్, జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (3) రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన ఆదర్శ ఐక్యరాజ్యసమితి మోడల్ యునైటెడ్ నేషన్స్ – మున్) కార్యక్రమంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన మెదక్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులను జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, అనర్గళ వాక్చాతుర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. జిల్లా విద్యాధికారి రాజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ, నాయకత్వ నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఆదర్శ ఐక్యరాజ్యసమితి, మాదిరి పార్లమెంట్ వంటి కార్యక్రమాలను మండల, జిల్లా స్థాయిల్లో కూడా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించడంతో పాటు వారికి మార్గనిర్దేశం చేసిన గైడ్ టీచర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ (టి జి ఐ ఆర్ డి) రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ సాంఘిక శాస్త్ర ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో మే నెలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలోని 23 జిల్లాల నుంచి ప్రతి జిల్లాకు చెందిన పది మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా, ఒకరు అంతర్జాతీయ ప్రెస్ సభ్యుడిగా పాల్గొన్నారు. వారిని ఐదు కమిటీలుగా విభజించి అంతర్జాతీయ అంశాలపై చర్చలు నిర్వహించారు. మెదక్ జిల్లాకు యూనిసెఫ్ (యు ఎన్ ఐ సి ఈ ఎఫ్) కమిటీలో “బాలలపై దోపిడీ, అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నివారణకు రక్షణ వ్యవస్థ బలోపేతం” అనే అంశం కేటాయించారు. ఈ విభాగంలో ప్రకటించిన పది ఉత్తమ అవార్డుల్లో ఎనిమిది అవార్డులు మెదక్ జిల్లా విద్యార్థులకే దక్కడం విశేషం. విజేతలు ఇలా…ఉత్తమ డెలిగేట్ అవార్డు: పల్లె పూజశ్రీ (జెడ్పీహెచ్‌ఎస్ ముస్లాపూర్, అల్లాదుర్గ్) – టర్కీ ప్రతినిధి. హై కమండేషన్ అవార్డులు: బి. అభిజ్ఞ (శంకరంపేట ఆర్ మోడల్ స్కూల్) – ఒమాన్ ప్రతినిధి; ఎల్. వనిశిక (జక్కపల్లి మోడల్ స్కూల్, నర్సాపూర్) – థాయ్‌లాండ్ ప్రతినిధి. స్పెషల్ మెన్షన్ అవార్డు: కే. అభినయ (జెడ్పీహెచ్‌ఎస్ కూచన్‌పల్లి, హవేలీ ఘన్‌పూర్) – వియత్నాం ప్రతినిధి. హానరబుల్ మెన్షన్ అవార్డులు: ఆర్సియా ఫాతిమా (జక్కపల్లి మోడల్ స్కూల్) – ఉగాండా ప్రతినిధి; పావులే ఐశ్వర్య (జెడ్పీహెచ్‌ఎస్ కాళ్లకల్, మనోహరాబాద్) – అమెరికా ప్రతినిధి; ఎ. సమీక్ష (టీజీఆర్‌ఎస్ గర్ల్స్, మెదక్) – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి; తోవల్లి జయశ్రీ (గాంధీనగర్, మెదక్) – యునైటెడ్ కింగ్‌డమ్ ప్రతినిధి. అంతర్జాతీయ ప్రెస్ – స్పెషల్ మెన్షన్ అవార్డు: చైతన్య తేజ (శంకరంపేట ఆర్ మోడల్ స్కూల్). ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనం మూర్తి, సాంఘిక శాస్త్ర జిల్లా ఫోరం అధ్యక్షుడు తిరునగరి నర్సింలు, రాష్ట్ర బాధ్యులు ఉన్నం రవిబాబు, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.