A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:25 am Posted by : A2TV NEWS

భారీ వర్షాలు.. ఘనాపూర్‌ ఆనకట్టను పరిశీలించిన ఎస్పీ

– సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టొద్దు

– ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, పోలీసు పికెట్లు ఏర్పాటు

– వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 31:

మెదక్ జిల్లా (30) భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా ఏడుపాయలలోని ఘనాపూర్‌ ఆనకట్టను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఆనకట్టలోకి వస్తున్న నీటి ప్రవాహం, నీటి మట్టం, పరిసర ప్రాంతాల పరిస్థితిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆనకట్ట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని హెచ్చరించారు. పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలోకి దిగడం లేదా నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో పశువులను మేపే కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో పశువులను వాగులు, కాలువలు తదితర ప్రవాహ ప్రాంతాల వైపు తీసుకెళ్లవద్దని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, పాపన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.